Friday, February 24, 2012

కాంగ్రెస్‌ ‘కాపురం’ కమ్మారెడ్డి గరం

కాంగ్రెస్‌లో ‘కుల’ కులం రేగింది. కమ్మ-రెడ్డి వర్గాలు కలసి కాపులపై యుద్దం ప్రకటించాయి. కాపులు సైతం దానిని ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నారు. ఇటీవలి కాలంలో కాపు వర్గానికి పెరుగుతున్న ప్రాధాన్యతను అడ్డుకునేందుకు ఆ రెండు వర్గాలు ఒక్కతాటిపైకి వస్తున్నాయి. ఫలితంగా కాంగ్రెస్‌లో కుల సమీకరణ లు ఆసక్తికరంగా మారుతున్నాయి. చిరంజీవి రంగప్రవేశంతో కాంగ్రెస్‌లో మొన్నటి వరకూ పెద్దగా గుర్తింపు లేని కాపులకు ఎక్కడ లేని ప్రాధాన్యం లభిస్తోం ది. ఆయన సిఫారసు చేసిన ఇద్దరికీ మంత్రి పదవులు ఇచ్చారు.

చిరంజీవిని అత్యంత కీలకమైన సమన్వయ కమిటీలో సభ్యుడిగా అవకాశం కల్పించారు. అదే సమయంలో సాంకేతికంగా బీసీలయినప్పటికీ, మానసికంగా తామూ కాపులుగా చెలామణి అవుతున్న తూర్పు కాపు, మున్నూరు కాపు వర్గానికి చెందిన డి.శ్రీనివాస్‌, బొత్స సత్యనారాయణ కూడా సమన్వయ కమిటీలో ఉండటంతో కాపులుగా భావిస్తున్న వారి సంఖ్య మూడుకు చేరినట్టయింది. పార్టీలో తమ కులాలకు ప్రాధాన్యం తగ్గించడాన్ని రెడ్డి-కమ్మ సామాజికవర్గం సహించలే పోతోంది. దశాబ్దాల పాటు పార్టీపై ప్రత్యక్ష పెత్తనం సాగించి, ముఖ్యమంత్రి పదవులను వరసగా సాధించిన రెడ్డి సామాజికవర్గం తాజా పరిణామాలతో కుతకు తలాడుతోంది. తాజాగా కమ్మ వర్గానికి చెందిన గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్టీలో సీనియర్లకు ప్రధానంగా కమ్మ వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘జగన్‌ ప్రజాదరణ ఉన్న నాయకుడు. కమ్మవారిని టాయిలెట్‌ పేపర్‌లా వాడుకుని వదిలేస్తున్నారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం తగ్గిస్తున్నారు.

వారికి ప్రాధాన్యం ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుస్తుందని ’ వ్యాఖ్యానించారు. నిజానికి రాయపాటి చాలాకాలం నుంచీ అసంతృప్తితోనే ఉన్నారు. తాను సీనియర్‌ అయినప్పటికీ, పార్టీ తనకు పదవులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఉడికిపోతున్నారు. దానికితోడు తన ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడాన్ని రాయపాటి జీర్ణించుకోలేకపోతున్నారు. గుంటూరు-కృష్ణా-ప్రకాశం జిల్లాల్లోని కాపు వర్గంలో పలుకుబడి, పట్టు ఉన్న కన్నాకు గుర్తింపు ఇవ్వడం రాయపాటికి సుతరామూ న చ్చడం లేదు.

అందుకే ఆయన అనేకసార్లు కన్నాపై అవినీతి ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా తన పార్లమెంటు పరిథిలోని పత్తిపాడుతో పాటు, జిల్లాలోని మాచర్ల ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత కన్నాపైనే ఉందని నేర్పుగా బంతిని ఆయన వైపు నెట్టేశారు. నిజానికి, తన ఎంపీ నియోజకవర్గ పరిథిలోని పత్తిపాడులో కన్నా జోక్యం చేసుకుంటున్నారని గతంలో కిరణ్‌, బొత్సకు రాయపాటి, ఆయన సోదరుడు శ్రీనివాస్‌, మంత్రి డొక్కా ఫిర్యాదు చేశారు. దానితో జోక్యం చేసుకోవద్దని వారిద్దరూ కన్నాకు సూచించారు. అదేసమయంలో పత్తిపాడు సీఐను కూడా మార్చి, రాయపాటి తను కోరుకున్న వ్యక్తిని తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో కన్నా పత్తిపాడుపై దృష్టి సారించడం మానేశారు. అయితే కమ్మ వర్గం 50 వేలు, కాపులు 35 వేల మంది రెడ్లు 17 వేల మంది ఉన్న అక్కడి ఓటర్లలో.. గెలుపును నిర్దేశించే కాపులు తనకు సహకరించరన్న ముందు జాగ్రత్తతోనే, రాయపాటి అక్కడి అభ్యర్ధి విజయం కన్నాపైనే ఉందని లౌక్యంగా ప్రకటించారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కానీ కన్నా మాత్రం.. తనను జోక్యం చేసుకోవద్దని ఫిర్యాదు చేసిన రాయపాటి అక్కడ అభ్యర్ధి ఎంపిక, గెలుపు బాధ్యతను భుజాన వేసుకోవాలని పార్టీకి స్పష్టం చేసినట్లు సమాచారం.

అదీగాక.. తాజాగా నర్సరావుపేటలో జరిగిన కమ్మసభలో తామంతా కలసి ఉండాలని చంద్రబాబును కోరానని బహిరంగంగానే చెప్పారు. అసలు రాయపాటి ఎప్పుడూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఎంపీ నిధులు ఇవ్వరని, కమ్మ వర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలకే ఇస్తారని కన్నా వర్గం మొదటి నుంచీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ రకంగా గుంటూరు జిల్లాలో కమ్మ-కాపు మధ్య పోరు జరుగుతోంది. అటు మరో సీనియర్‌ ఎంపీ కావూరి సాంబశివరావు కూడా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితోనే ఉన్నారు. తనకంటే జూనియర్‌ అయిన పురంధీశ్వరికి కేంద్రంలో చోటివ్వడాన్ని ఆయన తొలి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తాజాగా కాపు కోటా నుంచి చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇస్తారన్న వార్తలు కావూరిని ఆగ్రహంతో రగిలిస్తున్నాయి.

మొదటి నుంచీ పార్టీ జెండాను మోస్తున్న తమను కాదని, మధ్యలో వచ్చిన కొత్తవారిని అందలం ఎక్కించడం ఆయనకు నచ్చడం లేదు. రాయపాటి, కావూరి ఇద్దరూ అనేక సందర్భాల్లో తమ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందంటూ బాహాటంగానే ఆక్రోశం వెళ్లగక్కారు. చిరంజీవికి కేంద్రమంత్రి పదవితో పాటు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ సీనియర్లకు అవకాశం ఇవ్వకుండా కేవలం పీఆర్పీకే మంత్రివర్గంలో చోటు కల్పించే యత్నంపై వారిద్దరూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు కూడా నాయకత్వ వైఖరిపై విరుచుకుపడ్డారు.

‘కృష్ణా జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట. కమ్మ సామాజికవర్గం పార్టీని ఎప్పుడూ ఆదుకుంటూనే ఉంది. అయినా మాపై నిర్లక్ష్యం. ఇప్పుడు పదవులు ఇవ్వకపోతే ఎప్పుడు ఇస్తారంటున్నారు. ఏం చేయాలి? పదవులు అడుక్కోవాలా? మేం ఏ మొహం పెట్టుకుని జిల్లాకు వెళ్లాల’ని పాలడుగు నిలదీసినంత పనిచేశారు. చిరంజీవి వ ర్గీయులకు మంత్రి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకించడం లేదని, అయితే సీనియర్లను గుర్తించాలని డిమాండ్‌ చేశారు. వీరంతా కాపు వర్గానికి పెద్ద పీట వేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక కోస్తా కాంగ్రెస్‌లో సరిపడని కమ్మ-రెడ్లు తాజా పరిణామాల నేపథ్యంలో ఒక్కటయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని దశాబ్దాల నుంచి పార్టీని శాసించిన రెడ్డి వర్గానికి చిరంజీవి రాకతో గొంతులో వెలక్కాయపడినట్టయింది. వరసగా ముఖ్యమంత్రి పదవులను చేజిక్కించుకుంటున్న రెడ్లకు.. ఇటీవలి కాలంలో కాపులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం రుచించడం లేదు.

జగన్మోహన్‌రెడ్డి వైపు రెడ్లు వెళుతున్నందున ఇక రెడ్లకు ప్రాధాన్యం తగ్గించాలని నాయకత్వం నిర్ణయించడంపై అసంతృప్తితో ఉన్నారు. జగన్‌ సాకుతో తమను అణచివేసి, కాపులను అందలం ఎక్కించే పథకాన్ని అడ్డుకునేందుకు రెడ్డి వర్గీయులు రంగంలోకి దిగారు. రెడ్లను పక్కకుపెడితే పార్టీ ఇంకా నష్టపోతుందని నాయకత్వంపై ఒత్తిడి చేసే పనిలో ఉన్నారు.అదే సమయంలో తమ ఒకరి పోరాటంతోనే ఇది సాధ్యం కాదని గ్రహించిన రెడ్డి వర్గం, కమ్మ వర్గాన్ని సమన్వయం చేసుకుని కాపులపై యుద్ధానికి నడుంబిగిస్తోంది. తాజాగా సీనియర్‌ నేత, వివాదరహితుడిగా పేరున్న మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే రెడ్లు పార్టీ నాయకత్వంపై అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి.

జగన్మోహన్‌రెడ్డికి జనబలం ఉందని, ఆయనకు జనబలం లేదని తానెప్పుడూ అనలేదని వ్యాఖ్యానించారు. ‘జగన్‌కు నాయకత్వ లక్షణాలు లేవని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఆయన సభలకు జనం వస్తున్నారు. సీనియర్ల సేవలు అవసరం లేదని నాయకత్వం భావిస్తున్నట్లుంది. వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్‌ ఇవ్వకపోయినా నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేయను. రాజకీయాల్లో కులభావన పెరుగుతోంది. క్యాబినెట్‌లో తెలంగాణకు దామాషా ప్రకారం మరికొన్ని పదవులు ఇవ్వవలసి ఉంది’ అని గాదె వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాపులకు నాయకత్వం ఇస్తున్న అధిక ప్రాధాన్యంపై అసంతృప్తి స్పష్టమవుతోంది.
దానికితోడు.. కాపులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే రెడ్లు మొత్తం జగన్‌కు జై కొడతారన్న హెచ్చరిక కూడా ఆయన మాటల్లో ప్రతిధ్వనిస్తోంది. అయితే, గాదె చేసిన వ్యాఖ్యలను రాయపాటి స్వాగతించి, మద్దతు తెలపడం చూస్తే ఆ రెండు సామాజికవర్గాలు ఒక్క తాటిపైకి వచ్చి కాపులపై యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

అటు కాపు వర్గం కూడా రెడ్డి-కమ్మ వర్గంపై కత్తులు నూరుతోంది. కాంగ్రెస్‌ పార్టీని దశాబ్దాల నుంచి శాసిస్తోన్న రెడ్లు, జనాభా సంఖ్య తక్కువయినా.. అంతకుమించి గౌరవం పొందుతున్న కమ్మ వర్గం ఇంకా పెత్తనం చేయాలని భావించడం సరికాదని కాపు నేతలు వాదిస్తున్నారు. 10 శాతం జనాభా ఉన్న తమను కాంగ్రెస్‌ నాయకత్వం దశాబ్దాల నుంచి దన్నుగా నిలుస్తున్నప్పటికీ, తమను నిర్లక్ష్యం చేసిందని గుర్తు చేస్తున్నారు.

అయినప్పటికీ, తాము మౌనంగా ఉన్నామని, ఇప్పుడు తమకు అవకాశం వచ్చినప్పుడు రెడ్డి-కమ్మ వర్గీయులు అడ్డుపడటంపై కాపు వర్గం మండిపడుతోంది. చిరంజీవి వచ్చిన తర్వాత తమకు ప్రాధాన్యం పెరిగితే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. జగన్‌ వైపు రెడ్లు వెళుతున్నందున ఇంకా ఆ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం అవివేకమని, ఇప్పుడు రెడ్డి వర్గానికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎన్నికల సమయంలో వారంతా జగన్‌ వైపు వెళతారని స్పష్టం చేస్తున్నారు. కమ్మ వర్గం కూడా టీడీపీ వైపు వెళుతుందని, ఆ క్రమంలో ఒక్క కాపులు మాత్రమే పార్టీకి దన్నుగా నిలుస్తారని విశ్లేషిస్తున్నారు. అందువల్ల కాపులకు అవకాశాలు ఇవ్వడంలో తప్పేమీ లేదంటున్నారు.

అంతకు ముందు.. కాపులకు కాంగ్రెస్‌ పార్టీలో అన్యాయం జరుగుతోందని, ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాపులను అణచివేస్తూ సొంత వర్గానికి పెద్ద పీట వేస్తు న్నారని కాపునాడు రాష్ట్ర నేత మిరియాల వెంకట్రావు బాహాటంగా ఆరోపించిన విషయం తెలిసిందే. పైగా కన్నా, వ ట్టి వంటి వారికి అప్రాధాన్య శాఖలు ఇచ్చారని, బొత్స ఎదుగుదలను సీఎం అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మిరి యాల నేరుగా రెడ్లపైనే తన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం స్పష్టమవుతోంది.

తమకు రాక రాక వచ్చిన అవకాశాన్ని రెడ్డి-కమ్మ నేతలు ఒక పథకం ప్రకారం అడ్డుకోవడంతో దాన్ని తిప్పికొట్టాలని కాపు నేతలు నిర్ణయించుకున్నారు. దానికి కాపు సంఘాలను కూడా వినియోగించుకోనున్నారు. ఈ విషయంలో తాము ఎంతవరకయినా వెళ్లాలని తీర్మానించుకున్నారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలోని రెడ్డి-కమ్మ వర్గాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని.. నాయకత్వాన్ని చేజిక్కించుకుని, కాంగ్రెస్‌లో పైచేయి సాధించాలని నిర్ణయించుకున్నట్లు వారి మాటల ధోరణి స్పష్టమవుతోంది.

No comments:

Post a Comment