Friday, February 24, 2012

అధికారానికి బాట



బీసీలకు పెద్దపీట అధికారానికి బాట

February 22, 2012
రాష్ర్టంలో రాజకీయ అనిశ్చితి చోటుచేసు కుందా? అనేది చర్చనీయాంశమయింది. కాంగ్రెస్‌ పార్టీ తన స్వంత బలంమీద 2009లో పాల నాధికారాన్ని చేపట్టినా, సెప్టెంబర్‌లో అప్పటి ముఖ్య మంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రమాదవశాత్తూ మర ణించిన అనంతరం, ఆయన కుమారుడు వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి పదవి కూడా వారసత్వంగా తనకే దక్కాలనీ దృఢంగా ఆకాక్షిం చారు. అప్పటి ప్రభుత్వ సలహాదా రు, దివంగత ముఖ్యమంత్రికి ఆత్మబంధువుగా గుర్తింపు పొందిన కె.వి.పి. రామచంద్రరావు జగన్‌ ఆకాంక్షకు సహకరించి, అందుకు సుమారు 140 మంది శాసనసభ్యుల సంతకాలు సేకరించారు. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ బహిరంగంగా జగన్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు వ్యతిరేకించని దశలో, రాష్ర్టప్రజలు కూడా జగన్‌ ముఖ్యమంత్రి అవుతారేమో అనే ఆలోచనలో పడ్డారు.

ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రోశయ్య వయస్సు, జగన్‌ వర్గం కల్పిస్తున్న పాలనా అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు, తదితర సమస్యలతో సతమతమై, కాంగ్రెస్‌ అధిష్ఠానానికి తనను బాద్యతలనుంచి తప్పించమని కోరగా, అప్పటి స్పీకర్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డికి అధిష్ఠానం ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టింది. కిరణ్‌ కూడా రెడ్డి సామాజికవర్గానికి జెందిన రాయలసీమవాసి, కిరణ్‌ తండ్రి నల్లారి అమర్‌నాథరెడ్డి నెహ్రూ, ఇందిర కుటుంబాలకు అత్యంత సన్నిహితుడు కావడం, అలాగే జగన్‌కు చెక్‌ పెట్టగల సమర్థుడని అధిష్ఠానం భావించింది. ముఖ్యమంత్రిగా బొత్స సత్యనారాయణను సీఎంగా చేసి ఉంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అటు బీసీలనుండి, ఇటు కాపులనుండి మద్దతు లభించి ఉండేది. బహుశా స్వాతంత్యం వచ్చినప్పటి నుండి చాలా కాలం కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం రెడ్డి సామాజిక వర్గం చేతుల్లోనే ఉన్న నేపథ్యంలో, కాంగ్రెస్‌ అధిష్ఠానం రాష్ర్ట నాయకత్వాన్ని ఇతర సామాజిక వర్గ చేతుల్లోకి మార్చదలచుకొనలేదనేది స్పష్టమైంది.

ఇంతవరకు ఒక్క బీసీ నాయకుడు కూడా రాష్ర్ట ముఖ్యమంత్రిగా పదవిని పొందలేదు కాబట్టి, బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి అయితే అనేక బీసీ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాష్ర్టంలోని బీసీలు ఆశగా ఎదురు చూశారు. అంతేగాక కిరణ్‌ కుమార్‌రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు బీసీలకు అన్ని రంగాలలో కూడ మొండిచెయ్యేనని భావించారు. ఫీజు రియింబర్సుమెంటుకు నిధులు సకాలంలో విడుదల కాకపోవడం, రియింబర్స్‌మెంట్‌కు అర్హతగా ఎస్సీ, ఎస్టీలకు ఆదాయ పరిమితిని రూ. 2 లక్షలుగా పెంచి, బీసీలకు మాత్రం లక్ష రూపాయలు గానే కొనసాగించడం వారిలో ఈ అనుమానాల్ని పెంచాయి. రాష్ర్ట బీసీ కమిషన్‌ సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఉద్యోగ, విద్యారంగాలలోనున్న రిజర్వేషన్ల శాతాన్ని 25 శాతం నుంచి 48 శాతం వరకు వరకు పెంచవచ్చునని ప్రకటించి, రాష్ర్టవ్యాప్తంగా బహిరంగ విచారణలు చేపట్టింది. బీసీ రిజర్వేషన్లను పెంచేదిశగా నివేదిక సమర్పించేందుకు కమిషన్‌ మూడు నెలలు వ్యవధి కోరినా ఆ అభ్యర్థనను ప్రభుత్వం బుట్టదాఖలా చేసింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా రాష్ర్ట ఎన్నికల కమిషనర్‌ రమాకాంతరెడ్డి ప్రతిపాదనకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించింది. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 10.55 శాతం తగ్గించి, 23.45 శాతం చేశారు. మొత్తం రిజర్వేషన్లను 50 శాతం లోపు కుదించాలని రెడ్డి త్రయం- రమాకాంత్‌రెడ్డి, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, జానారెడ్డి- ప్రయత్నించారు.

బీసీల రిజర్వేషన్లను తగ్గించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదనీ, రాష్ర్టంలో బీసీల అధికారిక గణాంకాలుంటే, తదనుగుణంగా 50 శాతం రిజర్వేషన్లకంటే మించి ఇవ్వవచ్చుననీ సుప్రీంకోర్టు తీర్పు నిచ్చిందనే వాస్తవాన్ని మిగతా బీసీ మంత్రులను కూడా కలుపుకొని గట్టిగా వాదించినందున 60.55 శాతం రిజర్వేషన్లతోనే జీఓ విడుదలైంది. సర్పంచుల సంఘానికి చెందిన రెడ్డి సామాజిక వర్గపు అధ్యక్షునితో రాష్ర్ట హైకోర్టులో రిట్‌ పిటీషన్‌ వేయించారు. జస్టిస్‌ రోహిణి 60.55 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించమని తీర్పు నిచ్చినా- ఎన్నికలకు రాజకీయంగా సానుకూలత లేనందున, అందుకు వ్యతిరేకంగా మరో రిట్‌ పిటిషన్‌ను డివిజన్‌ బెంచిలో దాఖలు చేయించి ‘స్టే’ పొందారు.
ఈ చర్యలను గమనించిన బీసీలు, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డిని బీసీ వ్యతిరేకిగా భావించారు. ఏసీబీ రాష్ర్టవ్యాప్తంగా మద్యం మాఫియా మీద, ఎక్సైజ్‌ అధికారుల మీద దాడులు జరిపి అరెస్టులు కావించింది.

బొత్స సత్యనారాయణ మద్యం మాఫియా అనే ప్రచారం ముందుకు వచ్చింది. బీసీ సామాజిక వర్గ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేరును అరెస్టు మెమోలో చేర్చి, కోర్టుకు సమర్పించటంతో, రాష్ర్ట వ్యాప్తంగా బడుగులు భగ్గుమనడంతో మోపిదేవి రాజీనామాను కోరే అవకాశం లేకపోయింది!
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్‌ శాసన సభ్యుడయిన దామోదర్‌రెడ్డి బాహాటంగా, రాష్ర్ట ముఖ్యమంత్రి సీమాంధ్రకు సంబంధించిన వారు కాబట్టి, పీసీసీ అధ్యక్ష పదవిని తెలంగాణ వారికివ్వాలనే వాదనను బలంగా ముందుకు తెచ్చారు. ఈ డిమాండ్‌కు పునాదిగా, బొత్సకు జోడు పదవులున్నాయనే అంశాన్ని తెరమీదకు తేవడం జరుగుతోంది. ఈ చర్యలను తీవ్రంగా పరిగణించిన బీసీలు 1952 నుండి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జాతీయ పార్టీ నుండి ఇంతవరకూ బీసీ సామాజిక వర్గం నుండి ఒక్క ముఖ్యమంత్రినీ నియమించలేదనే అభిప్రాయానికి వచ్చారు. ఇప్పుడైనా అధిష్ఠానం ముఖ్యమంత్రి పదవిని బీసీల కిచ్చి, పీసీసీ పదవిని తెలంగాణ ప్రాంత రెడ్డి సామాజిక వర్గానికిస్తే, 2014 ఎన్నికలలో రాష్ర్టంలో 50 శాతంతో అతిపెద్ద వర్గమైన బీసీలు, 12 శాతం ఉన్న కాపులు కలసి మళ్ళీ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గెలుపించుకొని, బీసీ ముఖ్యమంత్రినే 2019 వరకూ కొనసాగించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ఒప్పించగలగుతామని కాంగ్రెస్‌పార్టీలోని బీసీలు, కాపులు బాహాటంగానే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కుమ్ములాటలను నియంత్రించి, పార్టీ కార్యకర్తలను ఒక తాటిమీదికి తెచ్చి, ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన పరిస్థితిలో గ్రూపు రాజకీయాలకు ముందుకు వచ్చి, వర్గ భేదాలను బహిర్గతం కావడంతో, కాంగ్రెస్‌ పార్టీ ఉప ఎన్నికలలోనే కాదు, 2014లో కూడ విజయం సాధించడం అసాధ్యమయ్యే అవకాశాలు అధికమవుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలోని రాజకీయ కుమ్ములాటలను తనకు అనుకూలంగా తెలుగుదేశం మలచుకొంటుందా, లేక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మలచుకొంటుందా అనే విషయం ఉప ఎన్నికలలోనే బయట పడబోతోంది. అందువల్ల ఇప్పటికైనా కాంగ్రెస్‌ అధిష్ఠానం కళ్ళుతెరచి, బీసీలలో పెరుగుతున్న రాజకీయ చైతన్యాన్ని, ఆకాంక్షలను గమనించి బీసీలకు పాలనా పగ్గాలు అప్పగించి రాష్ర్టంలో తన పార్టీ అధికారాన్ని కాపాడుకొంటుందా అనే విషయాన్ని వేచిచూడాలి!


source:surya paper 22.02.12

No comments:

Post a Comment