Friday, February 24, 2012

రాష్ట్రములో కుల ప్రాబల్యం

1980 దశకంలో రంగా హత్య తర్వాత కాపులు రాజకీయంగా సంఘటితం అయ్యే క్రమం పుంజుకుంది. ఒక వైపు తమ కులం ప్రాబల్యం గల, అంతకంటే మించి తమ నాయకత్వంలో గల- రాజకీయ పార్టీ కోసం ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. పైగా ఈ కుల సంఘటన తెలుగుదేశం వ్యతిరేకతను కూడా సంతరించుకుంది. కాపుల ప్రాబల్యం గల పార్టీ ఏర్పాటుకు కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి. దాసరి నారాయణరావు కొంత ఊగినా, కాంగ్రెస్‌పార్టీ ఆయనను తన కౌగిలిలోకి తెచ్చుకుంది. జనాకర్షణ గల నాయక త్వం లభించకపోవడంతో అలాంటి పార్టీ ఏర్పాటు ప్రయత్నాలు చల్లారిపోయాయి. తెలుగు దేశం పార్టీపట్ల వ్యతిరేకతతో వారు ప్రధానంగా కాంగ్రెస్‌కు సమర్ధకులుగా మిగిలిపో యారు. కాని కాపుల ప్రాబల్యంగల పార్టీ ఏర్పడాలన్న కాంక్ష కొనసాగుతూనే ఉంది.

మరొక వైపు బహుజనులను సంఘటితం చేయడానికి వారి నాయకత్వంలో రాష్ట్రంలో బహుజన సమాజ్‌ పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు కూడా 1990 దశకంలో ముమ్మరంగా సాగాయి. ఉత్తరప్రదేశ్‌ అనుభవంతో కాన్షిరాం ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని పొందాలని గట్టి ప్రయత్నాలు చేశారు. 1994 ఎన్నికలలో రాష్టవ్య్రాపితంగా పోటీ చేసి పెద్దఎత్తున ప్రచారాన్ని సాగించారు. కాని ఉత్తరప్రదేశ్‌ ఫలితాలను ఇక్కడ సాధించలేకపోయారు. ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి. కులాలను ఒక తాటిపైకి తేగల జనాకర్షణ గల నాయకత్వం ఈ కులాలకి లభించలేదు.

అంతకంటే మించిన రాజకీయ కారణాలు బలీయంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో బి.సి. లు ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి, ఎస్‌.సి, లు ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీకి ఓటు బ్యాంకులుగా ఉన్నాయి. రాజకీయంగా చిరకాలంగా ఇవి పరస్పర వైరి పక్షాల మధ్య చీలిపోయి వున్నాయి. అట్టడుగు స్థాయిలో ఉన్న ఈ రాజకీయ సంఘర్షణ వారిలో ఐక్యతకు తీవ్రమైన అవరోధం అయింది.

ఈ పరిణామం తర్వాత బహుజనుల ప్రాబల్యం గల పార్టీ ఏర్పాటు తెరమరుగైంది. కాని గణనీయమైన సంఖ్యలో ఉన్న బి.సి.లకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థలు వారి రాజ్యాధికారం పొందాలన్న కాంక్షను వ్యక్తం చేస్తూ వస్తున్నాయి.ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలకి ముందు ఒకవైపు కాపుల పార్టీ ఏర్పాటు మీద, మరోవైపు బి.సి.ల పార్టీ ఏర్పాటు మీద తర్జనభర్జనలు చేయడం పరిపాటి అయింది. కాని దీనికి ఒకరూపం ఇవ్వగల నాయకత్వం లభించకపోవడం- ఆయా ప్రధానపార్టీలలోఉన్న నాయకత్వం ఈ రగడ ద్వారా మరికొన్ని సీట్లు సాధించుకుని సర్దుకుపోవడం సాగిపో తున్నది.

ఈ నేపథ్యంలో 2009 ఎన్నికల ముందు అటు కాపులలో, ఇటు బి.సి.లలో స్వంత పార్టీల మీద మల్లగుల్లాలు ప్రారంభం అయ్యాయి. కాపు కులానికి చెందిన చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశానికి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. కాపుల గొడుగు కింద ఉన్న కులాల అండకు తోడుగా చిరంజీవికి గల జనాకర్షణ తోడైతే దానికి బి.సి.ల సామా జిక న్యాయాన్ని జతచేస్తే అదొక ప్రబల రాజకీయ శక్తిగా మారి ఎన్నికల్లో విజయాలను సాధిస్తుందని వారు భావించారు.

ఇలా చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం జరిగిపోయింది. 1982లో ఎస్‌.టి. రామారావు లాగా చిరంజీవి కూడా ఒక ప్రభంజనాన్ని సృష్టిం చగలుగుతారని ఆయన 9 నెలలలో అధికారంలోకి వస్తే చిరంజీవి 7, 8 నెలలలోనే అధికారాన్ని సొంతం చేసుకుంటాడని ఈ పార్టీ ఏర్పాటును ప్రోత్సహించిన వారు, దానికి సిద్ధపడిన వారు భావించారు. అయితే ఎన్‌.టి.ఆర్‌. కాలంనాటి రాజకీయ శూన్యతను- అలాగే తెలుగుదేశం పార్టీ కుల ప్రాబల్యం కలిగినప్పటికీ ప్రధాన స్రవంతి పార్టీగా రూపుదిద్దుకున్న తీరును వారు పరిగణనలోకి తీసుకోలేదు.

చిరంజీవి రాజకీయ ప్రవేశం సమయానికి- ఎన్‌.టి.ఆర్‌ ప్రవేశం నాడు ఉన్న రాజకీయ శూన్యత లేదు. అనాడు కాంగ్రెస్‌ పార్టీ ఏకచ్ఛత్రాధిప్రత్యానికి ప్రత్యామ్నాయం లేదు. ఎన్‌.టి.ఆర్‌. అలాంటి ప్రత్యామ్నాయాన్ని అందించారు. ఆనాటి రాజకీయ శూన్యతని ఆక్రమించారు. అధికారాన్ని కైవసం చేసుకున్నారు. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఒక దానికొకటి ప్రత్నామ్నాయంగా దీటైన స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఏక పార్టీ గుత్తాధిపత్యమూ లేదు. సంప్రదాయ రాజకీయ సంఘర్షణలో శూన్యత కూడా లేదు. ఇలాంటి సందర్భంలో చిరంజీవి రాజకీయ రంగం ప్రవేశం చేశారు. ఎన్‌.టి.ఆర్‌. కాలానికి భిన్నమైన రాజకీయ నేపథ్యంలో చిరంజీవి రాజకీయం మొదలు పెట్టారు. ఈ పరిస్థితులలో చిరంజీవి ముందు రెండు మార్గాలున్నాయి.

మొదటిది, సంప్రదాయ పార్టీలైన కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు ఒక నూతన ప్రత్యామ్నాయాన్ని సాధించగల పార్టీగా అవతరించడం! అంటే కొత్త తరహా రాజకీయం ఆధారంగా కొత్త రాజకీయ శక్తులను రంగంలోని తెచ్చి సంప్రదాయ పార్టీలను ఢీకొనడం. నూతన రాజకీయ సంస్కృతి పునాదిగా ఒక ప్రధాన స్రవంతి పార్టీగా ఆవిర్భవించడం. దీనికి సిద్ధాంత బలం కావాలి. ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు పరిష్కారాలు కావాలి. సంప్రదాయ రాజకీయ పక్షాలను సంప్రదాయ పద్ధతులతోనే ఢీ కొనడం.కాని ఆయన ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ప్రధాన స్రవంతి పార్టీలుగా ఉంటూనే కుల ప్రాబల్యం కొనసాగిస్తున్నాయి. అందువల్ల వాటికి కులముద్ర ఉన్నా అవి కులాలకి అతీతంగా ఓటు బ్యాంకులు గల పార్టీలుగా కొనసాగుతున్నాయి. వీటిని ఢీ కొనడానికి చిరంజీవి పెట్టిన పార్టీ- ఆదిలోనే కుల ముద్రతో ప్రారంభమైంది. చిరంజీవి జనాకర్షణతో అది ప్రధాన స్రవంతిగల పార్టీ అవుతుందని భావించారు. అలాగే కులం వెలుపల దానికి ఎలాంటి ఓటు బ్యాంకులు ఏర్పడ లేదు.


http://www.suryaa.com/archives/Article.asp?cat=1&subCat=7&ContentId=17825

No comments:

Post a Comment